Monday, 19 November 2012
Wednesday, 14 November 2012
'కల'వరం
'కల'వరం
పున్నమి నడి రేయిన అపుడపుడే
కలల ప్రపంచంలో అడుగిడుతున్న నన్ను
చల్లటి నీ స్పర్శతో నిదురలేపిన క్షణం నాకు తెలియనే లేదు
నా కలల ప్రపంచాన్ని వాస్తవంగా నాకందించబోతున్నావని
నీ చేయి పట్టి నడిచే నా మానసంలో ఎన్నో ప్రశ్నలు
ఐనా ఎంత ధైర్యమో నడిపించేది నీవని
చూస్తుండగానే పచ్చని చేలపై తేలియాడుతున్న వెన్నెల సంద్రం
కలో నిజమో తేల్చుకోలేని మధుర సంబ్రమాశ్చర్యంలో నుంచి
ఇంకా తేరుకోని నన్ను స్పర్శించాలని ఆ చల్లగాలి ఆశపడినంతనే
తన ఆశను అడియాశ చేస్తూ
నాకు చేయందించి చిలిపి చూపులతో చేలోని మంచెపైకి ఆహ్వానించి
వెచ్చని కౌగిలిలో నను బంధించిన నీకు
ఏమేమో చెప్పాలన్న ఆరాటం నను మూగను చేస్తుంటే
మాకు మాటలు వచ్చులే అంటూ
మనసూ మనసూ ఎన్ని ఊసులు చెప్పుకుంటున్నాయో అంటూ
తనువూ తనువూ గుసగుసలాడేంతలో
తెల్లవారిందంటూ అలారం మ్రోగుతుంటే
ఏది కలో ఏది నిజమో అన్న 'కల'వరంతో
మేలుకున్నాయి నా కళ్ళు.
*******
Monday, 5 November 2012
వరం
వరం
నిండీ నిండని కడుపుతో ఏ నోము నోచిందో
చాలీ చాలని బట్టతో ఏ పూజ చేసిందో
తలకెత్తుకున్న గంపతో ఏ వ్రతమాచరించిందో
బక్క చిక్కిన దేహంతో ఏ దేవుని మెప్పించిందో గానీ
మన పెదవులపై మెరుపులా మెరిసి మాయమయ్యే చిరునవ్వును
తన పెదవులపై శాశ్వతంగా నిలిచే వరం పొంది
ఎందరికి స్ఫూర్తిదాయకమైందో
ఈ చిన్నారి ప(ని)సి పాప.
*********
Saturday, 3 November 2012
చెలిమి
చెలిమి
నాడు అందమైన పూల పరిమళాలెన్నిటినో కాదని
నా చరణాలకు పానుపై అమరిన
ఆ పచ్చికకు పూచిన చిన్ని పూవు
నాకందించిన ఆనందాన్ని నీతో పంచుకున్న
ఆ జ్ఞాపకం నేటికీ నాలో సజీవమే
నాడు ఆ చిన్ని లేగదూడ చిరుగంటల సంగీతానికి
నా మువ్వల సవ్వడికి నడుమ జరిగిన పోటీలో
ఆనందంగా ఓడిన ఆ అందమైన అనుభవాన్ని
నీతో పంచుకున్న మధురక్షణాలూ నేటికీ సజీవమే
నాడు జాబిలి చేయందుకుని చల్లని వెన్నెలలోకంలో
విహరించిన అద్భుతమైన నా కలల ప్రపంచాన్ని
నీ ముందు ఆవిష్కరించి నిన్నుక్కిరిబిక్కిరి చేసిన
ఆ సరదా సంగతులూ సజీవమే
నాడు నీ చెలిమిన అలుపన్నది ఎరుగక
నీతో పంచుకున్న ప్రతిక్షణమూ నాలో సజీవమే
నేడూ ఎన్నోఅందమైన అనుభవాలు
మధురానుభూతులు, అద్భుతమైన ఊహలు
చిన్న చిన్న గాయాలు, తుళ్ళిపడే ఆనందాలు
నీతో పంచుకోవాలని ఎంత ఆరాటమో ఈ మనసుకి
కానీ కరిగిన బాల్యం పెరిగిన వయసు అంటూ
చెలిమికి హద్దులు గీసీలోకం
నిన్ను నాకు దూరం చేసింది
ఐతేనేం పసిపాప మనసులాటి నిష్కల్మషమైన మన చెలిమి
ఏదో నాటికీ లోకానికి తెలియక పోదు
అంతవరకు సజీవమైన నీ జ్ఞాపకాలతో
మరిన్ని జ్ఞాపకాలు పోగు చేసుకుని నీకై నిరీక్షిస్తూ
నీ నేస్తం......
*********
Thursday, 4 October 2012
అభిసారిక
అభిసారిక
ఎన్నో యుగాల నిరీక్షణలా తోస్తోంది నాకు
నీకై వేచి చూస్తున్న ప్రతి క్షణమూ
ఎంతసేపటి నుంచో నీ రాకకై నా ఎదురుచూపులు
ఎంతకీ నీ జాడ కానరాదాయే
నా దృష్టి వీధి చివరికంటా సారించా
నీవొస్తున్న దృశ్యం లీలగానైనా కనబడునేమోనని
నా తలపులలో తప్ప నీ చిరునామా కనుగొనలేనైతి
నీకై అభిసారికలా వేచి ఉన్న నాపై
ఎన్నో తుంటరి చూపులు మరెన్నో అనుమానపు చూపులు
మరికొన్ని జాలి చూపుల జల్లులలో
తడిసి ముద్దవుతున్న ఆ క్షణం నీపై కోపంతో
నా మోము ఎర్రవారుతున్నంతలో
లీలగా నీవోస్తున్న సడి అంతే
అంత కోపమేమాయెనో గానీ ఆ క్షణంలో
నా ఆనందం కట్టలు తెంచుకున్న ఆ సెలయేటి ఝరే
అంతవరకు నీ తలపులు మోస్తున్న నన్ను అమాంతం ఎత్తుకుని
చల్లని గాలిలో సేద దీర్చి నిద్రపుచ్చి నీవు సాగిపోతున్నావు
ఇంతలో నా గమ్యం రానే వచ్చింది ఇక ఈ రోజుకు నీకు వీడ్కోలు
మరల రేపు మన కలయిక తప్పక వస్తావు కదూ
నీకై వేచి చూస్తూ ఇక్కడే..........(బస్టాండులో)
మరువకు సుమా!
*********
Thursday, 13 September 2012
ఎంత బావుణ్ణు
ఎంత బావుణ్ణు
తొలి సంధ్య వేళ ఆకాశం చిత్రించిన ఆ అందమైన
చిత్రానికి నా కనులు అంకితమీయగలిగితే ఎంత బావుణ్ణు!
సుప్రభాతాన ఆ ప్రభాత వీచికలతో పక్షులంపే
మధుర గీతాలకు నా చెవులనంకితమీయగలిగితే ఎంత బావుణ్ణు!
సూర్యోదయాన ఆ కడలి కిరణాలతో భానుడాడే కిరణాలాటలోని
మెరుపులను నా కనుల నింపుకోగలిగితే ఎంత బావుణ్ణు!
సప్తవర్ణాల ఆ ఇంద్రధనుస్సు ఊయలపై
నా ఊహలనూయలాలూపగలిగితే ఎంత బావుణ్ణు!
వసంత శోభతో కళకళలాడే ఆ వనాన్ని
చీరగా ధరిస్తే ఎంత బావుణ్ణు!
గ్రీష్మాన మండిపడే ఆ భానుని ఎరుపును
నా నుదుటి సింధూరంగా ధరిస్తే ఎంత బావుణ్ణు!
ఆ తొలకరి చినుకుల చిటపట పాటకు
నా కాలిమువ్వల రవళిని జత చేస్తే ఎంత బావుణ్ణు!
శరద్పున్నమి వెన్నెలఘరిలో వెలిగిపోయే ఆ కొబ్బరాకు మెరుపులను
నా తనువున నింపుకోగలిగితే ఎంత బావుణ్ణు!
హేమంతపు మంచు పూలను
నా సిగన ధరిస్తే ఎంత బావుణ్ణు!
శిశిరానా ఆ మానులు పరచిన ఆకులపరుపుపై
ఆదమరచి శయనిస్తే ఎంత బావుణ్ణు!
నా ఏ ఒక్క ఊహైనా
నిజమైతే ఎంత బావుణ్ణు!
ఆ క్షణం వేగమనే చరణాలతో చలించే ఆ కాలం
మందగామినిగా మారిపోతే ఎంత బావుణ్ణు!
**********
Tuesday, 21 August 2012
Tuesday, 14 August 2012
కల-నిజం
కల-నిజం
మూసినా కనురెప్పల వెనుక స్వప్నం
జీవితంలో ఎన్నడూ చూడని అందమైన రంగులు చూపుతూ
తీరని కోర్కెలు తీర్చుతూ ఆనందడోలికల్లో ఊయలూగిస్తుంటే
పరవశాన జారిన ఒక్కో ఆనందబాష్పం ఓ మకరంద బిందువు
ఆ మకరందాన్నాస్వాదించేలోపే తట్టి లేపిందా వాస్తవం
నా ఆశల, ఊహల, భావాల, మాటల గొంతునొక్కి,
తెరచిన నా కనులకు సంద్రపు బిందువులనలంకరించి,
మౌనమనే రంగు నా పెదవులకద్ది.
నిజం! భావాలొలికే నా కన్నులు గానీ
పలికే నా పెదవులు గానీ ఎవరికవసరం?
భావ విహీనమైన నా మోము, అలంకృతమైన నా దేహం
చాలును కదా మరి వారికి.
*********
Thursday, 9 August 2012
బృందావని
బృందావని
తన ప్రతిబింబాన్ని చూడగోరినదై
యమునా తటి పై వంగిన ఆ రాధికను
చెంత చేర్చుకు ఆ నీటి అద్దాన్ని మించిన
అందమైన నిజాన్ని తన కన్నులు చెబుతాయంటుంటే
సిగ్గుతెరలు తొలగించుకుని ఆ కొంటె వాని కన్నులలోకి చూచినా రాధిక
తన్మయత్వమున తనను చూచుకొనుట మరచె
ఆ నల్లవాని రూపమును తనివితీరా చూస్తున్న ఆ తన్మయిని
మోహావేశమున చూస్తూ మైమరచినాడా మాధవుడు
అంత తన్మయులైనా రాధామాధవుల జూచి ధన్యత నొందెనా బృందావని.
యమునా తటి పై వంగిన ఆ రాధికను
చెంత చేర్చుకు ఆ నీటి అద్దాన్ని మించిన
అందమైన నిజాన్ని తన కన్నులు చెబుతాయంటుంటే
సిగ్గుతెరలు తొలగించుకుని ఆ కొంటె వాని కన్నులలోకి చూచినా రాధిక
తన్మయత్వమున తనను చూచుకొనుట మరచె
ఆ నల్లవాని రూపమును తనివితీరా చూస్తున్న ఆ తన్మయిని
మోహావేశమున చూస్తూ మైమరచినాడా మాధవుడు
అంత తన్మయులైనా రాధామాధవుల జూచి ధన్యత నొందెనా బృందావని.
***********
Thursday, 2 August 2012
రెక్కలు తొడిగిన పసితనం
రెక్కలు తొడిగిన పసితనం
నా పసితనమంతటి అమాయకత్వం
నా బోసినవ్వంతటి స్వచ్ఛత
నా ఆటలాంటి ఆనందం
నా పాటలంత మాధుర్యం
నా మనసంతటి సున్నితత్వం
నా అంతటి అందం
నా అల్లరంత సంతోషం
మరెక్కడైనా ఉందేమోనని
రెక్కలు కట్టుకుని మరీ వెతికాను
కానీ ఎక్కడా..........
అందుకే మా బాల్యాన్ని చిదిమేయద్దు
మాకు మా ఆట పాట దూరం చేయద్దు.
**********
Wednesday, 18 July 2012
ఋతురాగం
ఋతురాగం
ఎడారిని తలపించే మనసుతో బీడుగా మారిన వదనంతో నిరీక్షిస్తున్న ఆమెను
పరిణయమాడే వేళ ఆసన్నమైనదని ఉరుములతో సందేశాన్నంపి
విద్యుల్లతల కాంతుల నడుమ కరిగి ఆ కారుమేఘం
మింటి నుండి ఏకధారగా వర్షిస్తూ ఆమె తనువుని మనసును
కరిగించి కలుపుకొని ఆనందంతో ఏరులై పొంగి నదులై ప్రవహిస్తూ
ఎంతందంగా ఋతురాగాన్ని ఆలపిస్తోంది.
మరి అలాటి మంగళ వాయిద్యాలు దీపకాంతుల మధ్య
నిన్ను చేరి నా మనసునందిస్తే
నీవు నాచేయందుకుని అక్కున చేర్చుకున్నావు
నాటినుండి నా మనసు ఋతురాగానికై వేచిచూస్తూ............
***********
Friday, 13 July 2012
Thursday, 12 July 2012
Friday, 29 June 2012
ఆమె
ఆమె ను చూస్తేనే ఏవగింపు అసహ్యం
ఛీత్కారాలు చీదరింపులు
కానీ ఆమె ఎందఱో తల్లుల బిడ్డలకు అమ్మ
కన్న తల్లి ఒద్దనుకుని బిడ్డను విసిరేసినా
ఆమె మాత్రం అక్కున చేర్చుకుని
దిక్కులనే అంబరాలు కట్టి మురిసిపోతుంది
ఆ వీధి శునకాల, వరాహాల జోలపాటలతో లాలిస్తుంది
పసికూనలకే కాదు ఎందరో వీధి బాలలకు అన్నపూర్ణ ఆమె
ఇంకెందరో అనాధలకు బ్రతుకుతెరువు ఆమె
ఆమె మాతృత్వ ప్రపంచాన భేదమనేదే లేదు
అది మనిషైనా పశువైనా ఆమె మాతృత్వ మమకారానికి లోటు లేదు
అందరి కల్మషాన్ని తానే స్వీకరించి కూడా
నవ్వుతూ నిలిచినా ఆ స్థిత ప్రజ్ఞనేమనాలో చెప్పగలవారెవ్వరు?
మీరేమైనా....................
**********
Thursday, 28 June 2012
Wednesday, 27 June 2012
Monday, 25 June 2012
Sunday, 24 June 2012
నిరీక్షణ
నిరీక్షణ
ఆ కారుమేఘం కనులనిండా ఇంత నీరు నింపి పోయింది
తొలకరికేనాడూ నే పులకరించలేదనేమో
ఆ చల్లగాలి ఒళ్లంతా ముళ్ళు గుచ్చి పోయింది
ఆసాంతం తాకి పలకరించినా నే తనకేనాడూ బదులీయలేదనేమో
ఆ సుమ సుగంధాలు మనసుని మరింత బరువెక్కించాయి
చెంత చేరిన పరిమళాన్ని నే నేనాడు ఆస్వాదించలేదనేమో
ఆ వెన్నెల నను నిలువనీయడం లేదు
క్షణమైనా నే నేనాడు తన ఝరిలో తడవలేదనేమో
తెలియక చేసిన తప్పులని నను మన్నించక
ఇంత కక్ష నా పై న్యాయమా
ఓ ప్రకృతి శ్రావణానికై నిరీక్షించే నను
ఇకనైనా కనికరించవా .
*******
Saturday, 23 June 2012
గుప్పెడు మనసు
గుప్పెడంతే ఉన్నానంటూనే
ఎన్నో భావాల దొంతరలను దాచుకుంటుంది
ఎన్నో ఊహలకు ఊపిరి పోస్తుంది
ఎన్నో ఆశల సౌధాలకు పునాదులు వేస్తుంది
మరెన్నో స్వప్నాలకు ఊతమిస్తుంది
కాస్తంత సంతోషానికే కడలి తరంగమౌతుంది
కొండంత విషాదమొస్తే ఆల్చిప్ప తానౌతానంటుంది
అనుభవాల వ్యవసాయం చేసి
అనుభూతుల పంట పండిస్తుంది
అలసి అప్పుడప్పుడు స్తబ్దమోతుంది
అంతలోకే నూతన చైతన్యంతో ఉరకలు వేస్తుంది
కాస్త కలవరానికే కనుల వెంట జారి
తన ఉనికిని చాటుకుంటుంది
నిత్యం సంఘర్షణ రాజీలతో సతమతమౌతూనే
నవ వసంతానికై ఆశగా వేచిచూస్తుంది
నా మనసు.
******
Subscribe to:
Posts (Atom)