Thursday, 26 June 2014

మౌనం

మౌనం
పెదవి దాటలేక,
పెదవి మాటునే నా మాట 
మౌనాన్ని తన సహచరిగా తెచ్చుకుంది. 
****

Friday, 4 January 2013

మానసవీణ

మానసవీణ 
తూరుపు తీరంలో తెలతెలవారుతున్న వేళ
ఆ దినకరునికి స్వాగతం పలికే పక్షులు పాడే రాగం భూపాలం
భానుని లేత కిరణాల గిలిగింతలకు
తనువులూగుతున్న చివురాకు పాడే రాగం ధన్యాసి
మిట్టమధ్యాహ్నపు సూర్యుని  తీక్షణ లో
మెరుస్తూ కదలాడే ఆ కొబ్బరాకు పాడే రాగం సావేరి
పడమటి కనుమలలో అస్తమించే రవికి
వీడుకోలు చెప్పే వేళ గువ్వలు పలికే రాగం వసంతరాగం
చీకటి వేళ వెన్నెలతో వెలుగుతున్న
పుడమి గుండె పలికే రాగం నీలాంబరి
ఇన్ని రాగాలు వింటూ శృతి చేసిన
నా మానసవీణ పలికే రాగం శంకరాభరణం.
*********

Monday, 19 November 2012

వికృత కానుక

వికృత కానుక 
పుడమికి చినుకు ప్రేమ కానుక 
కలువలకు వెన్నెల ప్రేమ కానుక 
సంద్రానికి ముత్యం ప్రేమ కానుక 
ప్రకృతి లో ఇన్ని అందమైన ప్రేమ కానుకలను చూస్తూ కూడా 
పుత్తడి బొమ్మలకు  
యాసిడ్ దాడులు, కత్తిపోట్లు 
వేశ్యా వాటికలు, స్మశానాలు అంటూ 
ఈ వికృత కానుకలెందుకో?
*********

Wednesday, 14 November 2012

'కల'వరం

'కల'వరం 
పున్నమి నడి రేయిన అపుడపుడే 
కలల ప్రపంచంలో అడుగిడుతున్న నన్ను 
చల్లటి నీ స్పర్శతో నిదురలేపిన క్షణం నాకు తెలియనే లేదు 
నా కలల ప్రపంచాన్ని వాస్తవంగా నాకందించబోతున్నావని 
నీ చేయి పట్టి నడిచే నా మానసంలో ఎన్నో ప్రశ్నలు 
ఐనా ఎంత ధైర్యమో నడిపించేది నీవని 
చూస్తుండగానే పచ్చని చేలపై తేలియాడుతున్న వెన్నెల సంద్రం 
కలో నిజమో తేల్చుకోలేని మధుర సంబ్రమాశ్చర్యంలో నుంచి 
ఇంకా తేరుకోని నన్ను స్పర్శించాలని ఆ చల్లగాలి ఆశపడినంతనే 
తన ఆశను అడియాశ చేస్తూ  
నాకు చేయందించి చిలిపి చూపులతో చేలోని మంచెపైకి ఆహ్వానించి 
వెచ్చని కౌగిలిలో నను బంధించిన నీకు 
ఏమేమో చెప్పాలన్న ఆరాటం నను మూగను చేస్తుంటే 
మాకు మాటలు వచ్చులే అంటూ 
మనసూ మనసూ ఎన్ని ఊసులు చెప్పుకుంటున్నాయో అంటూ 
తనువూ తనువూ గుసగుసలాడేంతలో 
తెల్లవారిందంటూ అలారం మ్రోగుతుంటే 
ఏది కలో ఏది నిజమో అన్న 'కల'వరంతో 
మేలుకున్నాయి నా కళ్ళు.
*******
 

Monday, 5 November 2012

వరం

 వరం
నిండీ నిండని కడుపుతో ఏ నోము నోచిందో 
చాలీ చాలని బట్టతో ఏ పూజ చేసిందో 
తలకెత్తుకున్న గంపతో ఏ వ్రతమాచరించిందో 
బక్క చిక్కిన దేహంతో ఏ దేవుని మెప్పించిందో గానీ 
మన పెదవులపై మెరుపులా మెరిసి మాయమయ్యే  చిరునవ్వును 
తన పెదవులపై శాశ్వతంగా నిలిచే వరం పొంది
ఎందరికి స్ఫూర్తిదాయకమైందో 
ఈ చిన్నారి ప(ని)సి పాప.
*********

Saturday, 3 November 2012

చెలిమి

చెలిమి 
నాడు అందమైన పూల పరిమళాలెన్నిటినో కాదని 
నా చరణాలకు పానుపై అమరిన 
ఆ పచ్చికకు పూచిన చిన్ని పూవు 
నాకందించిన ఆనందాన్ని నీతో పంచుకున్న 
ఆ జ్ఞాపకం నేటికీ నాలో సజీవమే
 
నాడు ఆ చిన్ని లేగదూడ చిరుగంటల సంగీతానికి 
నా మువ్వల సవ్వడికి నడుమ జరిగిన పోటీలో 
ఆనందంగా ఓడిన ఆ అందమైన అనుభవాన్ని 
నీతో పంచుకున్న మధురక్షణాలూ నేటికీ  సజీవమే 
 
నాడు జాబిలి చేయందుకుని చల్లని వెన్నెలలోకంలో 
విహరించిన అద్భుతమైన నా కలల ప్రపంచాన్ని 
నీ ముందు ఆవిష్కరించి నిన్నుక్కిరిబిక్కిరి చేసిన 
ఆ సరదా సంగతులూ సజీవమే 
 
నాడు నీ చెలిమిన అలుపన్నది ఎరుగక 
నీతో పంచుకున్న ప్రతిక్షణమూ నాలో సజీవమే 
 
నేడూ ఎన్నోఅందమైన అనుభవాలు 
మధురానుభూతులు, అద్భుతమైన ఊహలు 
చిన్న చిన్న గాయాలు, తుళ్ళిపడే ఆనందాలు 
నీతో పంచుకోవాలని ఎంత ఆరాటమో ఈ మనసుకి 
కానీ కరిగిన బాల్యం పెరిగిన వయసు అంటూ 
 చెలిమికి  హద్దులు గీసీలోకం 
నిన్ను నాకు దూరం చేసింది 
ఐతేనేం పసిపాప మనసులాటి నిష్కల్మషమైన మన చెలిమి 
ఏదో నాటికీ లోకానికి తెలియక పోదు  
అంతవరకు  సజీవమైన నీ జ్ఞాపకాలతో
మరిన్ని జ్ఞాపకాలు పోగు చేసుకుని నీకై నిరీక్షిస్తూ 
నీ నేస్తం......
*********
 
 
 
 
  

Thursday, 4 October 2012

అభిసారిక

 అభిసారిక 
ఎన్నో యుగాల నిరీక్షణలా తోస్తోంది నాకు 
నీకై వేచి చూస్తున్న ప్రతి క్షణమూ 
ఎంతసేపటి నుంచో నీ రాకకై నా ఎదురుచూపులు 
ఎంతకీ నీ జాడ కానరాదాయే
నా దృష్టి వీధి చివరికంటా సారించా 
నీవొస్తున్న దృశ్యం లీలగానైనా కనబడునేమోనని 
నా తలపులలో తప్ప నీ చిరునామా కనుగొనలేనైతి 
నీకై అభిసారికలా వేచి ఉన్న నాపై 
ఎన్నో తుంటరి చూపులు మరెన్నో అనుమానపు చూపులు 
మరికొన్ని జాలి చూపుల జల్లులలో 
తడిసి ముద్దవుతున్న ఆ క్షణం నీపై కోపంతో 
నా మోము ఎర్రవారుతున్నంతలో 
లీలగా నీవోస్తున్న సడి అంతే 
అంత కోపమేమాయెనో గానీ ఆ క్షణంలో 
నా ఆనందం కట్టలు తెంచుకున్న ఆ సెలయేటి ఝరే 
అంతవరకు నీ తలపులు మోస్తున్న నన్ను  అమాంతం ఎత్తుకుని 
చల్లని గాలిలో సేద దీర్చి నిద్రపుచ్చి నీవు సాగిపోతున్నావు 
ఇంతలో నా  గమ్యం రానే వచ్చింది ఇక ఈ రోజుకు నీకు వీడ్కోలు 
మరల రేపు మన కలయిక తప్పక వస్తావు కదూ 
నీకై వేచి చూస్తూ ఇక్కడే..........(బస్టాండులో)
మరువకు సుమా!
*********