Friday 29 June 2012

ఆమె 
ఆమె ను చూస్తేనే ఏవగింపు అసహ్యం 
ఛీత్కారాలు చీదరింపులు 
కానీ ఆమె ఎందఱో తల్లుల బిడ్డలకు అమ్మ 
కన్న తల్లి ఒద్దనుకుని బిడ్డను విసిరేసినా 
ఆమె మాత్రం అక్కున చేర్చుకుని 
దిక్కులనే అంబరాలు కట్టి మురిసిపోతుంది 
ఆ వీధి శునకాల, వరాహాల జోలపాటలతో లాలిస్తుంది 
పసికూనలకే కాదు ఎందరో వీధి బాలలకు అన్నపూర్ణ ఆమె 
ఇంకెందరో అనాధలకు బ్రతుకుతెరువు ఆమె 
ఆమె మాతృత్వ ప్రపంచాన భేదమనేదే లేదు 
అది మనిషైనా పశువైనా ఆమె మాతృత్వ మమకారానికి లోటు లేదు 
అందరి కల్మషాన్ని తానే స్వీకరించి కూడా 
నవ్వుతూ నిలిచినా ఆ స్థిత ప్రజ్ఞనేమనాలో చెప్పగలవారెవ్వరు?
మీరేమైనా....................
**********

Thursday 28 June 2012

అపూర్వ సంగమం

అపూర్వ సంగమం 




ఆమె హృదయపు లోతులను 
అంతగా తరచి చూసాయి కనుకనే 





ఆమె ఆర్తిని తమ వేనవేల చేతులతో 
ఆమె విభునికి నివేదించ


చలించిన ఆ విభుని హృదయం ఆమెనెలా చేరిందో






 కరిగిన ఆ హృదయం 
ఆమె హృదయాన్నెలా కరిగించిందో 







ఇక ఆ అపూర్వ సంగమాన్ని తిలకించిన    ప్రకృతి పులకింత 
వర్ణింప శక్యమా......!

Wednesday 27 June 2012

స్వాతి చినుకు


స్వాతి చినుకు 
స్వాతి చినుకంత స్వచ్ఛమైనదే 
నీ కన్నీరైతే 
ఫలితమెంత అందమైనదో చూడు.

Monday 25 June 2012

మౌనం

మౌనం
మౌనానికి లిపి ఉంది 
చూడగలిగే కనులు 
చదవగలిగే మనసు నీకుందా మరి?
********
 మౌనాన్ని అలరించే 
కన్నులున్నట్లే 
కన్నులనలరించే 
మౌనాలూ ఉన్నాయి.
******

Sunday 24 June 2012

నిరీక్షణ

నిరీక్షణ
ఆ కారుమేఘం కనులనిండా ఇంత నీరు నింపి పోయింది 
తొలకరికేనాడూ నే పులకరించలేదనేమో
ఆ చల్లగాలి ఒళ్లంతా ముళ్ళు గుచ్చి పోయింది 
ఆసాంతం తాకి పలకరించినా నే తనకేనాడూ బదులీయలేదనేమో
ఆ సుమ సుగంధాలు మనసుని మరింత బరువెక్కించాయి 
చెంత చేరిన పరిమళాన్ని నే నేనాడు ఆస్వాదించలేదనేమో
ఆ వెన్నెల నను నిలువనీయడం లేదు 
క్షణమైనా నే నేనాడు తన ఝరిలో తడవలేదనేమో
 
తెలియక చేసిన తప్పులని నను మన్నించక 
ఇంత కక్ష నా పై న్యాయమా
ఓ ప్రకృతి శ్రావణానికై నిరీక్షించే నను 
ఇకనైనా కనికరించవా .
*******

Saturday 23 June 2012

గుప్పెడు మనసు

గుప్పెడంతే ఉన్నానంటూనే 
ఎన్నో భావాల దొంతరలను దాచుకుంటుంది 
ఎన్నో ఊహలకు ఊపిరి పోస్తుంది 
ఎన్నో ఆశల సౌధాలకు పునాదులు వేస్తుంది 
మరెన్నో స్వప్నాలకు ఊతమిస్తుంది 

కాస్తంత సంతోషానికే కడలి తరంగమౌతుంది 
కొండంత విషాదమొస్తే ఆల్చిప్ప తానౌతానంటుంది

అనుభవాల వ్యవసాయం చేసి 
అనుభూతుల పంట పండిస్తుంది 

అలసి అప్పుడప్పుడు  స్తబ్దమోతుంది 
అంతలోకే నూతన చైతన్యంతో ఉరకలు వేస్తుంది 

కాస్త కలవరానికే కనుల వెంట జారి 
తన ఉనికిని చాటుకుంటుంది  

నిత్యం సంఘర్షణ రాజీలతో సతమతమౌతూనే 
నవ వసంతానికై  ఆశగా వేచిచూస్తుంది 
నా మనసు.
******