Thursday 13 September 2012

ఎంత బావుణ్ణు

ఎంత బావుణ్ణు 
తొలి సంధ్య వేళ ఆకాశం చిత్రించిన ఆ అందమైన 
చిత్రానికి నా కనులు అంకితమీయగలిగితే ఎంత బావుణ్ణు!

సుప్రభాతాన ఆ ప్రభాత వీచికలతో పక్షులంపే
మధుర గీతాలకు నా చెవులనంకితమీయగలిగితే ఎంత బావుణ్ణు!

సూర్యోదయాన ఆ కడలి కిరణాలతో భానుడాడే కిరణాలాటలోని 
మెరుపులను నా కనుల నింపుకోగలిగితే ఎంత బావుణ్ణు!

సప్తవర్ణాల ఆ ఇంద్రధనుస్సు ఊయలపై 
నా ఊహలనూయలాలూపగలిగితే ఎంత బావుణ్ణు!
వసంత శోభతో కళకళలాడే ఆ వనాన్ని 
చీరగా ధరిస్తే ఎంత బావుణ్ణు!
గ్రీష్మాన మండిపడే ఆ  భానుని ఎరుపును 
నా నుదుటి సింధూరంగా ధరిస్తే ఎంత బావుణ్ణు!

ఆ తొలకరి చినుకుల చిటపట పాటకు 
నా కాలిమువ్వల రవళిని జత చేస్తే ఎంత బావుణ్ణు!

శరద్పున్నమి వెన్నెలఘరిలో వెలిగిపోయే ఆ కొబ్బరాకు మెరుపులను 
నా తనువున నింపుకోగలిగితే ఎంత బావుణ్ణు!
హేమంతపు మంచు పూలను 
నా సిగన ధరిస్తే ఎంత బావుణ్ణు!
శిశిరానా ఆ మానులు పరచిన ఆకులపరుపుపై 
ఆదమరచి శయనిస్తే ఎంత బావుణ్ణు!
నా ఏ  ఒక్క ఊహైనా 
నిజమైతే ఎంత బావుణ్ణు!
 
ఆ క్షణం వేగమనే  చరణాలతో చలించే ఆ కాలం 
మందగామినిగా మారిపోతే ఎంత బావుణ్ణు!
**********