Thursday 13 September 2012

ఎంత బావుణ్ణు

ఎంత బావుణ్ణు 
తొలి సంధ్య వేళ ఆకాశం చిత్రించిన ఆ అందమైన 
చిత్రానికి నా కనులు అంకితమీయగలిగితే ఎంత బావుణ్ణు!

సుప్రభాతాన ఆ ప్రభాత వీచికలతో పక్షులంపే
మధుర గీతాలకు నా చెవులనంకితమీయగలిగితే ఎంత బావుణ్ణు!

సూర్యోదయాన ఆ కడలి కిరణాలతో భానుడాడే కిరణాలాటలోని 
మెరుపులను నా కనుల నింపుకోగలిగితే ఎంత బావుణ్ణు!

సప్తవర్ణాల ఆ ఇంద్రధనుస్సు ఊయలపై 
నా ఊహలనూయలాలూపగలిగితే ఎంత బావుణ్ణు!
వసంత శోభతో కళకళలాడే ఆ వనాన్ని 
చీరగా ధరిస్తే ఎంత బావుణ్ణు!
గ్రీష్మాన మండిపడే ఆ  భానుని ఎరుపును 
నా నుదుటి సింధూరంగా ధరిస్తే ఎంత బావుణ్ణు!

ఆ తొలకరి చినుకుల చిటపట పాటకు 
నా కాలిమువ్వల రవళిని జత చేస్తే ఎంత బావుణ్ణు!

శరద్పున్నమి వెన్నెలఘరిలో వెలిగిపోయే ఆ కొబ్బరాకు మెరుపులను 
నా తనువున నింపుకోగలిగితే ఎంత బావుణ్ణు!
హేమంతపు మంచు పూలను 
నా సిగన ధరిస్తే ఎంత బావుణ్ణు!
శిశిరానా ఆ మానులు పరచిన ఆకులపరుపుపై 
ఆదమరచి శయనిస్తే ఎంత బావుణ్ణు!
నా ఏ  ఒక్క ఊహైనా 
నిజమైతే ఎంత బావుణ్ణు!
 
ఆ క్షణం వేగమనే  చరణాలతో చలించే ఆ కాలం 
మందగామినిగా మారిపోతే ఎంత బావుణ్ణు!
**********





14 comments:

  1. ఎంత అందమైన భావమో!

    ReplyDelete
    Replies
    1. పద్మార్పిత గారు ధన్యవాదాలు

      Delete
  2. వీణ గారూ, చక్కని కవిత మంచి భావం మనసుకు హత్తుకొనేలా ఉంది.

    ReplyDelete
    Replies
    1. ఫాతిమా గారు మేకు నా కవిత నచ్చినందుకు ధన్యవాదాలు

      Delete
  3. చక్కగా రాశారండి.

    ReplyDelete
  4. మీలా మేము కూడా ఇంత బాగా వ్రాయగలిగితే
    ఎంత బాగుణ్ణు...:-)
    అని చదువరులు అనుకునేలా వ్రాసారు వీణ గారూ!
    అభినందనలు...
    @శ్రీ

    ReplyDelete
    Replies
    1. అమ్మో! ఎంత మాట అనేసారు శత కవితా సుమాలు పూయించిన మీ ముందు నేనెంత ఏమైనా మీ అభిమానానికి ధన్యవాదాలు :-)

      Delete
  5. నా ఏ ఒక్క ఊహైనా
    నిజమైతే ఎంత బావుణ్ణు!

    నిజం! నిజం!!నిజం!!! ఎంతబావుణ్ణు

    ReplyDelete
    Replies
    1. శర్మ గారు ముందుగా నా బ్లాగ్ కు స్వాగతం మరియు మీ స్పందనకు ధన్యవాదాలు

      Delete
  6. ఇంత అందమైన భావాన్ని పంచుకున్నందుకు అభినందనలు వీణ గారూ...

    ReplyDelete
  7. నిజమే ఎంత బాగుణ్ణు! అంత బాగుంటుంది కనుకనే మనకి దూరమయ్యిందేమో అండీ!

    ReplyDelete
    Replies
    1. :-) ayyundavachchu rasagnagaru dhanyavaadaalu

      Delete