Wednesday, 18 July 2012

ఋతురాగం

ఋతురాగం 
ఎడారిని తలపించే మనసుతో బీడుగా మారిన వదనంతో నిరీక్షిస్తున్న ఆమెను 
పరిణయమాడే వేళ ఆసన్నమైనదని ఉరుములతో సందేశాన్నంపి
విద్యుల్లతల కాంతుల నడుమ కరిగి ఆ కారుమేఘం 
మింటి నుండి ఏకధారగా వర్షిస్తూ ఆమె తనువుని మనసును 
కరిగించి కలుపుకొని ఆనందంతో ఏరులై పొంగి నదులై ప్రవహిస్తూ 
ఎంతందంగా ఋతురాగాన్ని ఆలపిస్తోంది.
మరి అలాటి మంగళ వాయిద్యాలు దీపకాంతుల మధ్య 
నిన్ను చేరి నా మనసునందిస్తే 
నీవు నాచేయందుకుని అక్కున చేర్చుకున్నావు 
నాటినుండి నా మనసు ఋతురాగానికై వేచిచూస్తూ............
***********

Friday, 13 July 2012

అందం-ఆభరణం

అందం-ఆభరణం 
నిండుదనాన్ని మించిన అందం 
అమాయకత్వాన్ని మించిన ఆభరణం 
లేదంటోందీ పడతి.
కాదనగలరా?

Thursday, 12 July 2012

సెలయేరు

సెలయేరు 
 వేగాన్ని ఆమె యవ్వనానికి 
 ఒంపులను  ఆమె తనువుకు 
గలగలలను ఆమె అందెలకు 
మెరుపులను ఆమె ఆభరణాలకు ఇచ్చి 
తృప్తిగా వెనుతిరిగిందా సెలయేరు.
********

Friday, 29 June 2012

ఆమె 
ఆమె ను చూస్తేనే ఏవగింపు అసహ్యం 
ఛీత్కారాలు చీదరింపులు 
కానీ ఆమె ఎందఱో తల్లుల బిడ్డలకు అమ్మ 
కన్న తల్లి ఒద్దనుకుని బిడ్డను విసిరేసినా 
ఆమె మాత్రం అక్కున చేర్చుకుని 
దిక్కులనే అంబరాలు కట్టి మురిసిపోతుంది 
ఆ వీధి శునకాల, వరాహాల జోలపాటలతో లాలిస్తుంది 
పసికూనలకే కాదు ఎందరో వీధి బాలలకు అన్నపూర్ణ ఆమె 
ఇంకెందరో అనాధలకు బ్రతుకుతెరువు ఆమె 
ఆమె మాతృత్వ ప్రపంచాన భేదమనేదే లేదు 
అది మనిషైనా పశువైనా ఆమె మాతృత్వ మమకారానికి లోటు లేదు 
అందరి కల్మషాన్ని తానే స్వీకరించి కూడా 
నవ్వుతూ నిలిచినా ఆ స్థిత ప్రజ్ఞనేమనాలో చెప్పగలవారెవ్వరు?
మీరేమైనా....................
**********

Thursday, 28 June 2012

అపూర్వ సంగమం

అపూర్వ సంగమం 




ఆమె హృదయపు లోతులను 
అంతగా తరచి చూసాయి కనుకనే 





ఆమె ఆర్తిని తమ వేనవేల చేతులతో 
ఆమె విభునికి నివేదించ


చలించిన ఆ విభుని హృదయం ఆమెనెలా చేరిందో






 కరిగిన ఆ హృదయం 
ఆమె హృదయాన్నెలా కరిగించిందో 







ఇక ఆ అపూర్వ సంగమాన్ని తిలకించిన    ప్రకృతి పులకింత 
వర్ణింప శక్యమా......!

Wednesday, 27 June 2012

స్వాతి చినుకు


స్వాతి చినుకు 
స్వాతి చినుకంత స్వచ్ఛమైనదే 
నీ కన్నీరైతే 
ఫలితమెంత అందమైనదో చూడు.

Monday, 25 June 2012

మౌనం

మౌనం
మౌనానికి లిపి ఉంది 
చూడగలిగే కనులు 
చదవగలిగే మనసు నీకుందా మరి?
********
 మౌనాన్ని అలరించే 
కన్నులున్నట్లే 
కన్నులనలరించే 
మౌనాలూ ఉన్నాయి.
******